నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, March 13, 2013

ఆకలి కేక

ఇప్పుడే నేను నా 
నెత్తుటిని ఆకలికి 
అమ్ముకున్నా 

ఆకలేస్తుందని అడిగేవాడినా 
అమ్మ ఏడ్చేది ఎందుకో 
బాల్యం  నుంచి అలవాటైన ఆకలి 
 పేగుల్ని మెలిపెట్టి 
కసితీర్చుకుంటుంటే 
నన్ను నేను పాతెసుకుంటూ 
ప్రతీరోజు ఆకలిలో నిద్రిస్తూ 

జేబుల్ని ,మనసుల్ని 
ఖాళి చేసుకుని 
నిమ్మిత్త మాత్రంగా ఉండి 
ఆలోచనల వసారాలో 
పచారీ చేస్తూ 
జీవితపు మలుపులను 
ఊహిస్తే ఆకలి తీరదు 

లోకపు తరాజు మానవత్వాన్ని
తూచేస్తుంటే   ఓ వైపు 
తలుచుకోకుండానే  పలకరించే 
అతిదిని సంతృప్తి పరిచేందుకే 
కొలిమిలో కాలుతున్న 
ఇనుములా కరుగుతూ 
కాసుల వేటలో రాసులుగా 
నన్ను నేను అమ్ముకుంటూ 


చర్మం కింద కండలన్నీ 
దండిగా ఉన్న రోజుల్లో 
ఒంటిలోని సత్తువని 
కూడదీసుకుని 
ఒక్కో రోజు ఒక్కో సంద్రం దాటుతూ 
ఈ తీరం చేరి 

ఇంక  దాటాల్సిన దారుల్ని 
చేరలేక ,రోజు తరుముకొచ్చే 
ఆకలిని జయించలేక 
నెత్తుటిని ఆకలికి 
అమ్మకానికి పెడుతూ 
నా పేరు చెరిగిపోకుండా 
పేగుల్ని చల్లారుస్తున్నా