నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, April 27, 2013

॥ ఎక్కడికి పోగలం॥
ఎక్కడికి పోగలం
ఇక్కడ ఇన్ని బాద్యతలు
భుజానికెత్తుకున్నాక
ఈ లోకాన్ని వదిలి


కొన్ని కన్నీటి చారల్ని
చెంపలపై ముద్రించుకుని
ఆ మరకల్ని చెరుపుకోకుండా
చెమర్చిన కళ్ళతో వీడుకోలు
ఎలా చెప్పగలం

ముళ్ళ బాటలో నడుస్తూ
చీరుకు పోయిన గతం తాలూకు
నెత్తురోడుతున్న
జ్ఞాపకాల గాయాలు
మాన్పకుండా ఎలా
వదిలేయగలం

జీవన పోరాటం లో
ఎదురొడ్డి నిలుచున్నాక
పగిలిపోయిన పక్క వాడి
జీవితాన్ని చూస్తూ
యుద్ధం ఆపుతూ పొతే
మన జీవితపు పగుళ్ళు
పూడ్చకుండా
ఎలా వదిలేయగలం


జ్వలించడానికి
సిద్దపడ్డాక
ఆహోతైనా సరే దీపంలా
వెలుగు పంచాల్సిందే
విరిసినా వాడినా మౌనంగా
ఉండేందుకు పూలభాష నేర్చుకోవాల్సిందే
పిట్టలు తిని వదిలేసిన ఇంకాకొన్ని గింజలు
మన పేరుమీదనే ఉన్నాయి


కదానాయకుడే డీలా పడితే ఎలా
కదా నడవాలికదా
సశేష ప్రశ్నలకి అశేష సమాధానాలిస్తూ
నాటకం చివరి అంకం వరకూ

Friday, April 26, 2013

॥ యథాలాపంగా ॥
నడి రోడ్డుపై సూర్యుడు పెత్తనం చెలాయిస్తున్నాడు
నిశబ్దాన్ని ముక్కలు చేసి సర్రున దూసుకేళ్తుంది గాలి
చిల్లర పడని చిరాకులో బిచ్చగాడు దిక్కులు చూస్తున్నాడు
పూలపై తుమ్మెదలు రెక్కీ నిర్వహిస్తున్నాయి

బజారులో ఎక్కడో బాంబ్ పేలింది
స్నిఫర్ డాగ్ మసీదులో వాసన చూస్తోంది
వేకువ ఝామున జవాను సమయం సరిచేస్తుంటే
ఊరికే పడున్న ఉరికోయ్యలను నిద్ర లేపుతున్నారు కొందరు

అమ్మ చనుపాలు తమ్ముడు తాగుతుంటే అన్న గుర్రుగా చూస్తున్నాడు
గొంతులో దిగిన మందు ప్రభావంతో కొన్ని గొంతుకలు
జిందాబాద్ , ముర్దాబాద్ లుగా కొట్టుకుంటున్నాయి
ఎవరో తినిపారేసిన విస్తరికోసం
రేపటి పౌరులు కుక్కలతో కాట్లాడుతున్నారు

గోడపై పోస్టర్ చూడలేక బురదనీళ్ళు కొట్టి పోయాడు ఓ డ్రైవర్
రెక్కలు తెగిన మానవత్వపు పావురం
చివరి శ్వాస విడుస్తుంది మినార్ కి మందిరానికి మద్యలో
గాయపడ్డ సూరీడు నెత్తురు కక్కుకుంటూ రాలిపోయాడు
ప్రభాతానికి కర్ఫ్యూ లేకుంటే
రేపటికి వస్తాడో లేదో

Wednesday, March 13, 2013

ఆకలి కేక

ఇప్పుడే నేను నా 
నెత్తుటిని ఆకలికి 
అమ్ముకున్నా 

ఆకలేస్తుందని అడిగేవాడినా 
అమ్మ ఏడ్చేది ఎందుకో 
బాల్యం  నుంచి అలవాటైన ఆకలి 
 పేగుల్ని మెలిపెట్టి 
కసితీర్చుకుంటుంటే 
నన్ను నేను పాతెసుకుంటూ 
ప్రతీరోజు ఆకలిలో నిద్రిస్తూ 

జేబుల్ని ,మనసుల్ని 
ఖాళి చేసుకుని 
నిమ్మిత్త మాత్రంగా ఉండి 
ఆలోచనల వసారాలో 
పచారీ చేస్తూ 
జీవితపు మలుపులను 
ఊహిస్తే ఆకలి తీరదు 

లోకపు తరాజు మానవత్వాన్ని
తూచేస్తుంటే   ఓ వైపు 
తలుచుకోకుండానే  పలకరించే 
అతిదిని సంతృప్తి పరిచేందుకే 
కొలిమిలో కాలుతున్న 
ఇనుములా కరుగుతూ 
కాసుల వేటలో రాసులుగా 
నన్ను నేను అమ్ముకుంటూ 


చర్మం కింద కండలన్నీ 
దండిగా ఉన్న రోజుల్లో 
ఒంటిలోని సత్తువని 
కూడదీసుకుని 
ఒక్కో రోజు ఒక్కో సంద్రం దాటుతూ 
ఈ తీరం చేరి 

ఇంక  దాటాల్సిన దారుల్ని 
చేరలేక ,రోజు తరుముకొచ్చే 
ఆకలిని జయించలేక 
నెత్తుటిని ఆకలికి 
అమ్మకానికి పెడుతూ 
నా పేరు చెరిగిపోకుండా 
పేగుల్ని చల్లారుస్తున్నా 

Tuesday, February 19, 2013

|| హీరో ||
నా పదేళ్ళ వయసులో అదో
సుందర సుస్వప్నం
గుర్రంపై ఎన్టీఆర్ లా
హీరో సైకిల్ పై నాన్న


గిర్రున తిరిగే రెండు చక్రాలు
మోటార్ హీరోలని దాటేస్తుంటే
నేను యువరాజునై
స్వారి చేయాలనీ కోరిక


పచ్చసీటు
కడ్డికి రెండువైపులా
ఎన్టీఆర్ ,ఏన్నార్
చక్ర్రాల మద్యలో పూలు తో చేసే హల్లిసకం
ఆ రోజుల్లో మా నాన్న సైకిల్
ఓ దసరా బుల్లోడే

నిజానికి సైకిల్ మానాన్నకి
నేమ్ ప్లేట్
ఇంటిముందు అదుంటే
ఇంట్లో మా నాన్న మాతో ఉన్నట్టే


నేను విన్నానో లేదో మా నాన్న మాట
అది మాత్రం బ్రేక్ వేస్తె ఆగేది
లేకపోతె భాషా భాయి దగ్గర
రెంచీల తో రెండు దెబ్బలేయిన్చేవాడు


అలసటగా ఉంటె ఉత్తేజంగా ఆయిల్ ని
ఊపిరిగా గాలిని నింపితే మళ్లి
పాదరసం లా సర్రున సాగిపోయేది


నాన్న మంచమెక్కితే
హీరో సైకిల్ గోడకి చేరింది
ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ
జీవచ్చంలా అచేతనంగా
కొన్నేళ్ళు మౌనం గా
మా ఇంటి తొలి పుష్పకవిమానం


మేము మరిచినా తన బాద్యత
మరవలేదు సైకిల్ 
ఒంటి బరువు తగ్గాలని 
మళ్లీ తనని తోడు రమ్మంటే 
ఒక్కసారి వొళ్ళు విదుల్చుకుని 
తన బాద్యత మరచిన 
నన్ను రోజూ మోస్తోంది 
నాకెప్పటికీ ఇద్దరే హీరో లు 
ఒకటి నాన్న రెండు 
హీరో సైకిల్ ఇప్పటికి 
ఎప్పటికి .................

తేది :19.02.2013


Wednesday, February 13, 2013

రాతి సమాధి                                             రాతి సమాధి ఆస్వాదిస్తుందా

                                           అంజలి గా  రాలిన పూల సువాసనలని

Tuesday, February 5, 2013

|| ఎదురుచూపు ||కొన్ని సార్లు మనకన్నులు దారెంటే చూస్తుంటాయి
ఎన్ని దృశ్యాలు ఎదురైనా దాటేసుకుంటూ
అలసిపోయినా రెప్పవేయకుండా

రేయేదో పవలేదో తూచలేవు ఆ చూపులు
రంగులెన్ని పులుముకున్నా సరే
అనుకున్న దృశ్యం అగుపించేదాకా
మసకతెరలే కంటి నిండా

బరువైన రెప్పల్ని తనకోసం బలిచేస్తూ
ఆలోచనల ఆవర్తనాలలో పరిబ్రమిస్తూ
ఊహలనిప్పుల కొలిమిని రాజేస్తూ
చూడబోయే దృశ్యం కోసం
చూపులని గాల్లోనే వేలాడదీస్తూ
సమయాన్ని తొలుచుకుంటూ
ఎదురుచూపులు సాగుతుంటాయి

కోతకొచ్చిన పంటలా
వర్షించబోయే మేఘంలా
దాహార్తిలా , వేకువ ఝాములా
తదుపరి ప్రక్రియకోసం ఎదురుచూస్తూ
ఎదురు చూపులు నిజంగా ఎండమావులే

మసక తెరలని తుడిచేస్తూ
కాంతివేగంతో కనపడ్డ దృశ్యాన్ని
ఆలింగనం చేసికుంటూ
ఆనందం లో పెనవేసుకున్న
చూపుల చిక్కులు విడిపోవేమో

"ఎదురుచూపుల చిత్రం
ఎంతచూసినా తనివితీరని విచిత్రం"