నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, September 12, 2012

పల్లకీలో దేముడు

గూడెమంతా  సందడి 
పండగేం  గాదు
పతంగులు ఎగరలేదు 
సాయిబులు పీర్లు ఎత్తలేదు 
గాని అంతా వూదుకడ్డీల వాసన 

కిర్రుచెప్పుల సవ్వడి 
గుళ్ళో చదివే వేదాలు 
భజన కీర్తనలు,తాళాల చప్పుడు 
గాలి మోసుకొచ్చింది చెవుల్దాకా 

పూల పల్లకీలో దేముడు 
మా అంటరాని పేటలో 
ఎప్పుడో జమానా నుంచి 
ముంతా తాటాకు కట్టి 
విసిరేసిన  గూడేనికి
హవ్వ ! ఏంటి విచిత్రం 

అరవై ఏళ్లనుంచి నంజుకు తినబడుతున్న 
నాల్గో జాతి వీధిలోకి నరసింహ సాములోరు 
ఉరేగి పోయినాడు 
కళ్ళారా చూద్దామంటే ఆపిన నాథుడే లేదు 
పాపం పూలని మాత్రం చంపారు దేవుడి   పేరు జెప్పి 

ఊరికి కరువొచ్చినట్టు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు 
పౌర్ణమి రోజున వెన్నెల కాసినట్టు 
ఒక్కసారే వస్తాడంట దేముడు మా గూడేనికి

నల్ల దొరల రాజ్యం ఆర్తిగా పిల్చినా 
ఆలకించడేమి  దేవుడు 
చిక్కుకున్నడా దేవుడుకూడా మీ 
కబందహస్తాల్లో మా జీవితంలానే 

దేవుడు ని మా గూడేనికి తేవడం కాదు 
మమ్మల్ని తీసుకుపోండి 
మీ గుడిలోకి బడిలోకి మీ ఇళ్ళకి 
మీ మనసుల్లోకి 
కడుక్కోండి మీ మసులని 
మానవత్వపు జలం తో 

కుదిరిందా సరే సరి 
లేకుంటే ఈ సారి మీరు తెస్తే వచ్చేది 
ఒట్టి విగ్రహమే దేవుడు కాదు 
పైవాడికి తెలీదా మీ కులం 
రంగేసుకున్న  నాటకాలు (12sep2012)

Tuesday, September 4, 2012

ఎన్నో ఊహలు

ఎన్నో ఊహలు 
మది ఊహించడం మొదలెట్టినప్పటినుండి
అందమైన ఊహలు కొన్ని 
భయపెట్టిన ఊహలు కొన్ని 
ఊరించిన ఊహలు కొన్ని 
పిచ్చి పట్టించిన ఊహలు కొన్ని 

ఊహించకూడని ఊహలు ఊహిస్తూ 
భయపడిన ఊహలు కొన్ని 
ఊహించ వలసిన ఊహలు 
ఊహించకుండా ఓడిన ఊహలు కొన్ని 

బాల్యం లో పెద్దవాడిని కావాలని 
పెద్దయ్యాక బాల్యం లో కి వెళ్ళాలని 
ఎదగడానికి ఎందుకో ఊహకి అంత తొందర 

కలల లోకం లో ఊహల ఊయల 
ఊగుతూ కాలం గడిపేస్తే 
ఊయల ఊది పడితే వాస్తవం నొప్పిలా 
వెంటాడుతుంది 

భయాల బందిఖానాలో గడిపేస్తూ 
నిర్భీతి ఊహను తలుచుకోకుంటే 
భయం అనే ఊహే వురి తాడులా 
ఉసురు తీస్తుంది 

వయసుతో   పాటు  పెరిగిన ఊహలు 
మనసు మాట వినకపోతే 
ఊహలు నిన్ను ఊరేగించి 
చివరకు ఉత్సవ విగ్రహాన్ని చేస్తాయి 

ఊహ  అందమైనదే 
ఊహ అందని ద్రాక్ష 
వాస్తవం చేతికందిన ఫలం 
అందని ద్రాక్షని ఊహిస్తే
వాస్తవం అనే ఫలం పాడై
వాస్తవం  కూడా ఊహలానే మిగుల్తుంది 

Monday, September 3, 2012

ఇక్కడంతా క్షేమం


ఇక్కడంతా క్షేమం 
నేను నాతో బాధలు 
అంతా క్షేమమే 

ఉషస్సు లాంటి జీవితాన్ని 
సాయం  సంధ్యకిచ్చి చేసిన పెళ్లి 
మధ్యానపు ఎండలా మండుతోంది 

నెత్తి మీద పడ్డ అక్షింతలు పచ్చటి 
జీవితాన్ని గుర్తు చేస్తుంటే 
ఆశల అశ్వంపై సవారి చేస్తున్నా
పంటి బిగువున బాధను భరిస్తూ 

అందరూ నా వాళ్ళే నేనొక్కదాన్నే 
పనిమనిషిని వాళ్ళ మద్యలో 
అన్ని నాతోనే పంచుకుంటారు 
కోపం బాధ అసహ్యం అనుమానం 
వివిధ  రూపాల్లో రోజూ  దెబ్బల తో 

జీవితపు సీరియల్ లో నాదో
కథానాయిక పాత్ర 
కథ లో ప్రతీ పాత్ర 
 నా చుట్టూనే తిరుగుతుంది 
తిడుతూ కొడుతూ 

సాటి  ఆడదనే ఆలోచన అత్తకు రాదు 
ఆడబిడ్డ అసలు ఆడదే కాదు 
మరిది బెల్టుకి అత్త చేయి ఆసరాగా 
మారి నా వొంటి రంగుని మారుస్తుంది రోజు 

అన్నీ నావే నేనే దూరం అన్నింటికీ 
ప్రేమ జాలి నామీద నాకే 
అసహ్యం ఈ వ్యవస్థ మీద 
నాలా కొడిగట్టే దీపాలు ఎన్నో 
అన్ని సమిధలు అనుకుంటే పొరబాటే 

నిలిచి గెలిచి నా పాత్ర కు న్యాయం చేసి 
విజయబావుటా ఎగరేస్తాను 
అస్త్ర సన్యాసం చేస్తే యుద్ధం ఆగదు
యుద్ధం అంటే చావడం చంపడం కాదు 
శత్రువుని వోడించడం గెలుస్తా నిలుస్తా 

Saturday, September 1, 2012

ఈ గతం నాదేనా


నా జీవిత పుస్తకం లో 

నాకే తెలియని పుటలెన్నో

నేను రాయని అక్షరాలు

నా జీవితాన్ని చూపుతుంటే 

ఆశ్చర్యం గా అవలోకిస్తున్నా

ఈ గతం నాదేనా అని 

ప్రతీ పేజి తిరగేస్తున్నా 

నాకు నేను కనిపించక  పోనా అని 

పాడుబడ్డ బావి
వూరి చివరోళ్ళ నీళ్ళ కోసం కామందు
తవ్వించిన బావి 
చుట్టూ గచ్చునేల మద్య వెదురు బద్ద 
ఇనప గిలక అంతా పెళ్లి కూతురు ముస్తాబు 
ఎన్ని ఇళ్ళు తడిపిందో అవి కట్టినప్పుడు 
ఎన్ని పెళ్ళిళ్ళుకి నీళ్లిచ్చిందో ఆ బావి 
మా పేట పెద్ద ముత్తైదువు 

పెద్ద కామందు కన్ను పడింది 
కామేసుగాడి కొత్త పెళ్ళాం మీద 
సుక్కేసిన కామేసుగాడేమో
కామందు సావిట్లో
కామందేమో కామేసు గాడింట్లో 
పాపం ఆ పిల్ల ఆర్తనాదాలు 
వినపడ్డ గుడిసెల తలుపుల్లన్ని 
బిర్రుగా బిగుసుకున్నాయి 
కొరడా దెబ్బలు వూరి వెలివేతలు
గురుతొచ్చి

కేకలేన్ని వేసినా గుళ్ళో దేముడు 
కూడా రాలేదు 
రాయికదా వినపడలేదేమో
లేక వూరి బయట దళితులనేమో 

పాపం దిక్కుతోచని ఆ పిల్లకు 
ఈ పెద్ద ముత్తైదువ దిక్కయింది 
ఏడుస్తూ ప్రాణం పోయినా 
పతివ్రతలాగే పోవాలని 
అందులో దూకింది అంతే

బావిని మూసేశారు 
పెద్ద ముత్తైదువ ని విధవని చేసారు 
నీళ్ళతో కళకళ లాడేది పాపం 
నీళ్ళు తోడి పలకరించే నాధుడు లేక 
బాదతో బావి గుండె కుదించుకు పోయింది 
నీరు మొత్తం నేలలోకి ఇంకిపోయింది 

ఒక కామందు కామానికి 
ఒక ప్రాణం బలియై దయ్యమై 
తిరుగుతుంది బావి కాడ
ప్రజల అనుమానపు పొరల్లో

అణిచివేత ప్రజలపైనే కాదు 
ఊరి చివరోళ్ళ అవసరాలమీద 
కూడా అని అందరికి పాఠం
చెప్తుంది ఊరిచివర మా పాడుబడ్డ బావి 
హృదయ విదారకం గా ఏడుస్తూ 
మా ఊరిచివర పేట లాగా

లంచ గొండిఆకాశంలో చుక్కలు 
మీరు చేసిన  పాపాలు 
ఆకాశం లేని చోటకూడా
నువ్వుంటావ్ అక్కడ అవసరం వుంటే 
అవకాశం అవసరం సంపర్కం లో 
పుట్టిన అరాచక అవతారం 

అదిగో నువ్వు పర్మిట్టు ఇచ్చిన బస్సు 
పదిమంది  పసిపిల్లల నవ్వుల్నిచిదిమి 
చదునుచేసి కన్నవాళ్ళ కడుపుశోకం ను 
హారన్ గా చేసుకొని మ్రోగుతుంది 

బ్రతుకే భారమై అనారోగ్యం పాలై 
ఆసుపత్రికి వెళితే నీ కోరిక తీర్చలేక 
ప్రాణం పోయి ఆత్మ పైకెళ్ళిపొతే 
నిర్జీవ దేహానికి వెలకట్టే నీ మూర్ఖపు 
ఆలోచనలకు ఆత్మలన్నీ ఘోషిస్తున్నాయి 
సమాధుల నోళ్ళు తెరుచుకొని 

అసలే ముదిమి ఆపైన వెలివేత 
ఆ నాలుగు పించను రాళ్ళకోసం
నీ వద్దకు తిరిగిన మైళ్ళ దూరం 
పొరలు కప్పిన  నీ కళ్ళకు కనబడవు 
వారు విదిల్చిన  పాదధూళి నీ పై కలియ బడితే 
నీ కనులు కనుల పొరలు నేల రాలతాయి 

కష్టపడి చదివి జీవితపు వైకుంఠ పాళిలో
నిచ్చేనేక్కి పైకేల్లాలనుకుంటే
నీ కామ దాహం కాలసర్పమై కాటేస్తే 
రాసిన రాతకు కాక అందిన అందానికి మార్కులేసి 
కామ లంచం తీసుకుంటే 
ఆ సరస్వతుల నోళ్ళు శాపాలే పలవరిస్తాయి 

నీ నవ్వంత స్వచమైన నకిలీ విత్తనాలు 
రైతుల ప్రాణాలను తోడేస్తుంటే
నోట్ల కట్టలపై విష్ణుమూర్థిలా నిబిడాశ్చర్యం తో 
నిట్టూర్పు విడుస్తూ విచారం వ్యక్తం చేస్తే 
రేపు  నువ్వు తినే మెతుకు  విషమై నిన్నే మింగేస్తుంది 

జీవన చక్రం ఆగదు జీవిత కాలపు చివరి మలుపులో 
నీవు చేసిన పాపాలు ప్రళయం లా చుట్టుకుంటే 
నువ్వు లెక్కేసి పెట్టుకున్న నోట్ల కట్టలు నీ చితిని 
పేర్చి నిన్ను రారమ్మంటే 
నీకసలె పట్టని నీ అంతరాత్మ ఆఖరి నిముషంలో 
నీ గతం నీకు గుర్తు చేస్తే  ఆ భయానక దృశ్యం 
చూసే చేవ  లేని దద్దమ్మలా చావు 
అంతరాత్మని అంగీకరించలేని నీకు 
అదేం పెద్ద శిక్ష కాదు 

ఆ క్షణాన ..........................

ఆ క్షణాన ..........................

నేను పంపిన పూల పూరేకులు 
పగిలిన గుండెలో పుప్పొడి రాల్చేసాయి 

రెక్కలు తెగిన తూనీగ
నా వైపు వస్తుంది ఎగరలేక

రంగులద్ది పంపిన 
సీతాకోక చిలుక చిన్నబోయి 
నల్లరంగు పూసుకుని 
గొంగళి పురుగై పోయింది 
తన రంగు చూపలేక 

నా మనసు కాగితం పై 
రాసిపంపిన అక్షరాలూ 
మూగబోయి చెత్తబుట్టలో 
ఊపిరాడక నిస్తేజం మయ్యాయి 

నీ పరిమళాన్ని నింపుకున్న 
గాలి నిశబ్దాన్ని కోస్తూ 
నా గుండెలో అలజడి రేపెందుకు 
వస్తుంది పెనుగాలి లా 

రవి కిరణానికి విచ్చుకున్న గడ్డిపువ్వు 
అంతలోనే వాడింది నీ విసుగు చూపుకి 
నా ప్రేమను నువ్వు వొప్పుకోని సమయాన 

కాని .......................................
నా కంటికి మెదడు సందేశంఇస్తూనే వుంది 
నీకై చూడమని 
నా గుండెకు గురుతు చేస్తూనే వుంది 
తనకోసమే ఆగకుండా ఆడమని
నీకోసం ఎప్పటికి ...........................