నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, August 28, 2012

మనం మానవులం

నింగి కింద 
నేలకి పైన
మద్యలో నిండిన జాతి
మనం మానవులం  !

నిరాశా నిస్పృహల మద్య 
సావాసం చేస్తూ 
తన చుట్టూ తానే గిరి గీసుకునే 
సామాజిక స్నేహితులం  

ఆశావాది ఒకడు ,నిరాశావాది ఒకడు 
పుర్రెకో బుద్ది,జిహ్వకో రుచి అనుభవించే 
ఆస్వాదకులం

అబద్దాల జీవితం లో అనుమానపు 
అగ్గిపుల్ల వెలిగించి నిజాన్ని వెతికే 
మేథావులం

మనిషికో దేవుణ్ణి చేసుకుని 
మురిసిపోయే ఆధ్యాత్మీకులం 
వీరుచాలక బాబాల్ని నెత్తి కేత్తుకునే
మూడ భక్తులం 

మనిషికో జెండా గ్రూప్ కో  అజెండా 
దేశానికో ఆరాటం  గెలవాలని అణచాలని
స్కాముల్ని,స్కీముల్ని నమ్మేసి 
వోట్లేసే మర యంత్రాలం 

నేరం చేసేది మనమే తీర్పు  చెప్పేది మనమే 
సుఖం మనకే దుఖం మనకే 
జన్మ మనకే ,చావుమనకే 
పాపం చేసేది మనమే 
ఫలితం  అనుభవించేది మనమే 

మనకి మనమే దిశ నిర్దేశం 
మనమనసే మనకి దిక్సూచి 
నచ్చినట్టుగా సాగిపోదాం 
సర్వమానవ సమ్మేళనంలో 
కలిసి సాగుదాం మానవత్వపు 
బావుటాని మనిషి మనిషి 
భుజం పై మోస్తూ 

నేను ఆకలినినేను ఆకలిని 

పరిచయం అవసరంలేని అద్రుశ్యాన్ని
ప్రాణం తీసే దాన్ని నేనే పోసే దాన్ని నేనే 
తారతమ్యాలు లేవు నాకు 
పేద వాడైనా పెద్దవాడైనా నాకు దాసుడే 

మూగబోయిన గొంతుని సవరించేది నేనే 
రగిలిన గుండెల ఆర్తనాదాలకి  నాదం నేనే 
డప్పు కొట్టినా ,చెప్పులు కుట్టినా ,డబ్బులు కూడబెట్టినా 
వడ్డిలపై వడ్డీలు వేసి సామాన్యుడు ని హింసించినా 
నా కోసమే వారందరి తపన 

ఊరిబయట నిద్రకళ్ళతో వొంటిని అమ్ముకున్నా
అదే వూరి బయట కాలుతున్న శవం పక్కన సరిచేస్తూ నిలుచున్నా 
వీధి వెంబడి మురుగును తోడేస్తూ మానవ 
ఆలోచనా మలినాలని వెలికితీసినా 
నన్ను జయించేందుకే

పరిశ్రమ పెట్టినా , పక్కోడిని చంపినా 
ముఖానికి రంగేసుకున్నా , వేలమందిని తీర్చిదిద్దినా 
పూలు మొక్కలు పెంచినా ,వ్యవసాయం చేసినా 
దేశం మీదకి దేశం దండెత్తినా గెలిచినా ,ఓడినా 
సమస్త నరజాతి నాకు చేసే ఊడిగమే అది 

విశ్వ జగత్తుని సమయాభావం లేకుండా శాసించగల 
చక్రవర్తిని ,ఓటమి ఎరుగని మహిమాన్వితుడిని 
అష్ట ఐశ్వర్యాలు ఉన్నా లేకున్నా 
నాకు కావాల్సింది నాకు ఇస్తే నేను ఓ శాంతమూర్తి ని 

ఆంక్షలు పెట్టినా ,అవరోధాలెన్ని కల్పించినా 
నేనో వాస్తవాన్ని మనిషి అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ 
వారిమధ్య తారతమ్యాలను నిరోధించడానికి 
కృషి చేస్తున్న మానవతావాదిని 
ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆలోచన క్రియని 
నేను ఆకలిని....................................

Saturday, August 25, 2012

బోధి చెట్టు కింద బుద్దుడేరచ్చబండను ఆనుకుని రావి చెట్టు 
చిల్లులు పడ్డ నల్లని గొడుగు నీడన 
ఆరే బొడ్డు కొస్తే పుట్టాను నేను 
నన్ను తయారు చేసిన వాడు 
భారతమాత కడగొట్టు బిడ్డ 

తన రంగు నాకంటించి 
వూరి పాదాలు కందకుండా చేసే నేర్పరి 
వూరు మొత్తం నడుస్తుంటే తాను తలొంచుకుని 
కళ్ళతో పాదాలవంక చూస్తూ తన తలపులో 
ఏ కాలికి ఏ జోడు కావాలో కలగనే చిత్రకారుడు 

తన కరకు  చేతులతో ప్రేమగా   
ఆరెతో కోసినా గూటం తో మేకులు పొడిచినా 
దారంతో నన్ను బిగించినా నా కిష్టమే 
నన్ను తయారు చేసే సమయం లో అతనో దేవుడు 
కాలికి తొడిగి  నన్ను పంపే సమయం లో కన్న తండ్రి 
తెగిపోయినా ,అరిగిపోయినా నను బాగుచేసే వైద్యుడు 
చిన్న చిన్న పనులకి పైకం తీసుకోని పరోపకారి 

తనలా   మాసిపోయిన  తన పరదా మీద ఉన్న నేను 
స్తాన్డులోకి చేరాను కాల క్రమంలో 
పెద్ద యంత్రాల పళ్ళ మద్య 
అటు ఇటు తిప్పబడి గతిదనంలేక ఓటిగా తయారై నాను 
రాగి చెట్టు నీడ లో వుదకజని పీల్చుకునే నేను 
చలిమర గదులలో బిగుసుకుపోతున్నా

నా మెడకో తాడుకట్టి దానికో రేటు కట్టి 
డబ్బాలో పెట్టి రంగు రంగుల విషవలయం లోకి 
నన్ను మార్చి అమ్ముతుంటే 
మౌనం గా మమ్మల్ని కన్న మారాజుని తలుచుకొని 
మౌనం గ తలవంచుకున్నా

ఎంత ఎదిగినా నేను చెప్పునే నన్నేం రాజుని చేయరు 
మీకు నేను ఖరీదైతే కావచ్చు ,పాలీషు మెరుపుల్లో 
మెరవచ్చు 
తరిమేయొచ్చు మీరందరూ నా తండ్రిని 
జనారణ్యం లోనుంచి 
మీకే అంటరానివాడు 
నాకు మాత్రం బోధి చెట్టు కింద బుద్దుడే 

నవ్వుకో రాజకీయమా నవ్వుకో


నవ్వుకో రాజకీయమా నవ్వుకో 
నవ్వక ఏమి చేస్తావు ఈ రోజు  నీదైనప్పుడు 
గ్రీకుల మెదళ్ళలో పుట్టిన నువ్వు 
గల్లీ స్థాయికి దిగిపోయావ్ దిగజారి పోయావ్ 

ఎంతమంది రాజులు చక్రవర్తులని పోట్టనబెట్టుకున్నావ్
చైనా గోడను కట్టించావ్ ,బెర్లిన్ గోడను తోక్కిన్చేసావ్ 
లింకన్ను చంపేసావ్ ,కెన్నెడీ ని పంపేసావ్
లాడెన్ ,సద్దాం ,గడాఫీ నీ ముందు దిగదుడుపే 
రాజ్యం ఏదైనా దేశం  ఏదైనా నీ కనుసన్నలలోనే 
నడవాలని శాసించావ్

కులం రంగు పూసుకుని మతం పౌడర్ రాసుకుని 
వ్యభిచారిలా మారావ్ దేశాలను అమెరికాకు 
తారుస్తూ 

పచ్చగా ఉన్న మా రాష్ట్రాన్ని తిన్నావ్ 
రెండుగా చేసేందుకు యత్నిస్తున్నావ్ 
విగ్రహాలు కూల్చేసావ్ ,నిరాహార దీక్షలు చేయించావ్
ప్రజలను పిచ్చోళ్ళను చేస్తున్నావ్ 

ఎక్కడికైనా  వెళ్ళు సాహిత్యం జోలికి రాకు 
ఆదికవి నన్నయ్యే ,నువ్వు పూని చెప్పించిన 
అన్నయ్య చెప్పినా చెప్పకున్నా
అక్షరాలూ ఎదురు తిరిగితే పుట్టగతులు వుండవు నీకు 

దారి తెన్నూ లేని నావకు లంగరు అవుతావ్ అనుకుంటే 
నీవే నీరై మున్చేస్తున్నావ్ తస్మాత్ జాగ్రత్త 
పెరుగుట విరుగుట కొరకే 
నవ్వుకో రాజకీయమా నవ్వుకో 

నేను నా మౌనం తో మాట్లాడుతున్నాను


ష్ ...............!
నిశబ్దం.................. 

నేను 
నా మౌనం తో 
మాట్లాడుతున్నాను 

నా తప్పులన్నీ నా మౌనం లో
వెతుక్కుని సరిదిద్దుకుంటున్నాను
సవ్యమైన అంతరాత్మ దిశలో వెళుతూ 

కఠిన నిర్ణయాల కలబోతకు 
సమయం ఆసన్నమైంది 
నన్ను నేను వెతుక్కుంటున్నాను 
నేను తప్పి పోయిన చోట 

దేవుడో ,లోకమో ,స్నేహితులో 
పరిసరాలో, అవసరమో ఇంకోటో 
తప్పు చేయించినా చేసింది నేను 
అందుకే దిద్దుకుంటున్నా

విశ్వ అంతరాళం లో విసిరేయబడ్డ 
నా పాపాలన్నిటిని ఏరి ఒక చోట కూర్చి 
నిష్కృతి కోసం ఆచరణ సాద్యమైయిన
అవకాశాన్ని అందుకుంటున్నాను
నా మౌనం లో నన్ను నేను వెతుక్కుంటూ 

వస్తావుకదూ


ఇప్పుడే తెరిచాను
చిలిపి ఊహల గది తాళం 
చల్లగాలేదో వచ్చి నీ ఊసు చెప్పి వెళ్ళింది 
మేఘం తో నువ్వు పంపిన కబురు 
చినుకుగా ఇచ్చి ఇప్పుడే వెళ్ళింది 

ఇందాకే అనుకున్నా 
నీ మది లో నేను వున్నానా లేనా అని
వెంటనే చల్లగాలి పెనుగాలై వచ్చి 
హెచ్చరించి వెళ్ళింది 
సన్నజాజులన్ని తెల్లబోయాయి నా ఊహకి 
జడలోనుంచి మెడపై మెత్తగా గుచ్చాయి 
అమ్మో నువ్వు మయగాడివే
నన్నే కాదు ప్రకృతిని మాయ చేసావ్ 

విరహం ఓ వైపు వేదన ఓ వైపు 
నీ చేతి స్పర్శల గురుతులు ఓ వైపు 
నీ మాటల మహత్తు ఓ వైపు 
ఇలా నాలుగు దిక్కులనుండి నన్ను 
ఆవహించేస్తున్నావ్ రోజూ 

నీ మనసు కాగితం పై నాకై రాసిన 
అక్షరాలను చదువుకుంటూ
తడుముకుంటూ 
వెన్నెలలో ,వానలో మన జ్ఞాపకాలను 
మాల కడుతూ సిగ్గుల మొగ్గను అవుతున్నా

పరధ్యానమే ఎప్పుడూ అమ్మ అరిచినా 
నాన్న పిలిచినా ఫోన్ మోగినా 
నీ ధ్యాసలో నిండామునిగి వున్నా 
నిశ్చల సంద్రంలో దూరంగా 
సాగిపోతున్న నావలా 

చివురులన్ని పండుటాకులై రాలుతున్నాయి 
మామిడి కాయ మాగాయై జాడీలో బద్రం గా వుంది 
మంచం వెక్కిరిస్తుంది మల్లెలు గోలచేస్తున్నాయి 
కోయిల పిలిచి పిలిచి అలిసి అలిగింది నీపై 
ఇంత జరిగినా నువ్వు రాలేదు రాకూడదు అంటగా 

ఏంటో ఈ ఆషాఢ అధిక మాసం నన్ను నిన్ను దూరం చేస్తూ 
ఆశగా, బేలగా కళ్ళలో నిన్ను నింపుకుని 
నీ శ్రీమతి నీకై రాస్తున్న ప్రేమలేఖ 
అందుకుని స్పందించి వస్తావుకదూ

సమాజం చెక్కిన శిల్పం

వూరి చివర ఉత్తరం దిక్కున 
వీధి దీపం కింద నిస్తేజంగా 
గంటల్ని ,నిముషాలని ఆలోచనలతో 
లెక్కిస్తూ ఉసూరంటూ నిల్చున్నా
నా నీడే నన్ను ప్రశ్నిస్తుంది ఈ పూట 
నీ సంపాదన ఎంత అని 
అంతరంగం ఆక్రోసిస్తుంది ఈ మత్తు జగత్తిలో 
నీ స్థానం ఏమిటి అని 

సమాజం చెక్కిన శిల్పం నేను 
అవసరం వెతుక్కుంటూ వచ్చేవాళ్ల 
అదృష్టం నేను 
వేడి నిట్టుర్పుల మద్య కాలం
వెళ్ళదీస్తుంటాను 

నాకంటూ లేని జీవితం 
నావంటూ కాని కన్నీళ్ళు 
నేనంటూ పెంచుకొని బంధాలు 
మొండిగోడల్లా మిగిలే ప్రశ్నలు 

ఊరి కళ్ళు మూతలుపడే వేళ మేల్కొంటా 
అంగట్లో బొమ్మనై
పచ్చనోట్ల రెపరెపలు ,కనుసైగలు 
కౌగిలింతలు ,పంటి గాట్లు ,చెంపదెబ్బలు 
రోజుకో అనుభవం నా పనికి ఆహార పధకం లో 

ఒక కోరిక రాక్షసత్వం 
ఒకకోరిక తాగిన మైకం 
ఒక కోరిక మద దాహం 
ఒక కోరిక అన్నికోల్పోయిన నిస్తేజం 
ఒక కోరిక అనుభవం కోసం ఆరాటం 
ఆ క్షణం లో నేనో బొమ్మ 
నేనే ప్రేయసి ,నేనే తల్లి ,నేనే తండ్రి 
నేనే భూదేవి నేనే శ్రీదేవి 

నేను పుండై మరొకరికి పండై
తనువుని తమలపాకుని చేసి 
విటులకోరిక పండిస్తున్నాను
ఎందఱో మహా ఇల్లాళ్ళ శాపం 
నాకు తగులుతుందని తెలుసు 
ఆ శాపం నన్ను తాయారు చేసిన 
సమాజం మీదకి బదలాయిస్తున్నా
రోగాలను మాత్రం మౌనంగా భరిస్తున్నా
భూమాతలాగా.

వాన చినుకు

చల్లగా తడుముతోంది ఒక వాన చినుకు 
మెత్తటి మట్టిని ఆత్మీయం గా 
ఎక్కడో వాన చినుకు ఇక్కడికి వస్తోంది అతిధిగా 
ప్రకృతి ఆహ్వానిస్తోంది తనలో కలుపుకోవడానికి చినుకుని 
ఎన్నాళ్ళో వేచి చూసిన అనుభవం ప్రకృతి ది
ఏడిపించి మురిపించే దరి జేరే ఉద్దేశం చినుకుది
ఎంత ఏడిపించినా, వూరించినా చినుకు వస్తే మాత్రం 
తనలో కలిపేసుకుని ఆహ్వానిస్తుంది ప్రకృతి 
అపురూప ఆత్మీయ సంగమం అది 

తనొస్తే పులకరింత , అదేదో గిలిగింత 
రంగు మార్చుకుంటుంది ప్రకృతి 
అప్పటి వరకు మొహం మాడ్చుకున్నా సరే 
గట్టి నేల చినుకు పడితే చిత్తడి గా మారుతుంది 
ప్రేమికుని ఒదార్పులో కరిగే ప్రేయసి మనసులా 

ఎదురుచూపులోని ఆత్రం ప్రకృతిలో 
కలవాలనే తొందర వాన చినుకులో 
అనుబంధాల కలయిక ఈనాటిది కాదు 
ఆబంధం అజరామరం మట్టి వాసనంత 
ఆహ్లాదం,నెమలి నాట్యమంత అందం.

యదార్థ నాటకo
యాభై ఏళ్ల కిందటి ఒక భయానక దృశ్యం 
వళ్ళు గగుర్పొడిచే జీవితపు యదార్థ నాటక 
సన్నివేశం సరి దిద్దలేని శాపం అదే నా జీవితం 

జీవితం తెలియని రోజులు 
అమ్మ చేతి ముద్దలు
చింతగింజ ఆటలు,గుజ్జనగుళ్ళు
అమాయకపు చూపులు 
పన్నెండేళ్ళ వయసు 
పాలుగారే బుగ్గలు 
బడి కి వెళుతూ పాఠాలను .
వల్లెవేయడమే తెలుసు అదే 
నా బాల్యపు తీపి గురుతు 

ఓ రోజు ఆ రోజు అమావాస్య ! ఏమో నాకూ తెలీదు 
ప్రకృతి కూడా పసిగట్టలేదు, నాకు పట్టబోయే ఖర్మ 
రోజుకూసే కోడి కూయలేదు, పూచే మందారం కొమ్మ 
పూయలేదు అప్పుడే శంకించాను ఆనాటి అనర్ధం 
మా ఇంటికి వచ్చిందో అనర్ధం ముసలాడి రూపం లో 

పిల్ల బెషుగ్గావుంది,నీ అప్పులన్నీ ఎగిరిపోతాయి 
నాన్న కళ్ళలో ఆశ,ఆశపడ్డ అందలం ఎదురైనట్టు 
ముహూర్తాలతో పనిలేదు పిల్లనీదే 
పొద్దున్నే కూసే కోడి కూర ఐయింది 
నా పాలబుగ్గపై చిటికపడింది ఆశ గా 

ఆశల తరాజులో నా జీవితం లెక్క తెలిపోయిందో రోజు 
ముస్తాబు చేసి టౌను గౌను వేసి , పౌడేరూ కాటుకా పెట్టి 
పట్టీలు పెట్టి ఎత్తుమడాల చెప్పులేసి ఘల్లు ఘల్లున 
సాగింది నా పయనం నా కు తెలియకుండానే నరకానికి 
పెద్ద ఇంటి పెత్తనానికి బయలు దేరింది నేను అనేపిచ్చి పిల్ల 

బాగా ఎరిగిన మొహమే మా ఇంట్లో కోడి కూర తిన్న తాతే గా 
ఏమి కాదు నాన్న సర్దుబాటు , అమ్మ మొహం లో తత్తర పాటు 
ఎప్పుడు వెళ్తాం ఇంటికి అమ్మకి నా ప్రశ్న?ఇది నీ ఇల్లే నాన్న జవాబు 
అర్ధం కాలేదు చిన్న పిల్లగా హ హ హ హ హ అని నవ్వులు బోసి తాత వి 

ఒంటరిని సాయంకాలానికి పెద్ద మేడ లో దీపపు కాంతి లో
చెమటే వుంది నాతొ పాటు నా వంటికి అతుక్కుని 
భయం చేతులు కాళ్ళు వణికించింది చలికాలం కాకపోయినా 
పెద్ద మంచం ఎక్కలేకపోయా తనే ఎక్కించాడు 
నిద్ర లో పెద్ద మెలకువ ఏదో జరుగుతుంది 
పెద్ద గొడ్డలితో చిన్న పండును నరికిన అనుభవం 
ఇంక ఎప్పటికి నిద్ర పట్టలేదు రాత్రి ఒక నరకం ఎప్పటికి 

పట్టు చీర వంటి కి బరువైంది తను ఉన్నంత కాలం 
తాళాల గుత్తి నా నడుముని వంచేసింది తనులేని కాలం 
చూపుల అర్ధాలను జీవిత నిఘంటువులో వెతుక్కుంటూ 
ముప్పైల నిండు యవ్వనం లో తెల్లటి చీర వైధవ్యాన్ని వెక్కిరిస్తూ అద్దం
వోడలేక ,ఆడలేక ఆట మద్యలో మానలేక 
లేని రాని పెద్దరికం నటిస్తూ, మనసు చచ్చినా 
విధవ దేహంతో బతుకుతూ జీవిస్తున్నా జీవచ్చవంలా 

యాభై ఏళ్ల కిందటి చిన్నారి పెళ్ళికూతురిని.

Tuesday, August 7, 2012

భళ్ళున పగిలింది సీసా

రంగు సీసాలో చిక్కటి ద్రావణం 
కైపు ఎక్కించే వాసన 
కొంచం తాగవో ఫర్వాలేదు కాని 
మేము ఏమైనా వీర తాగుబోతులమా 
స్నేహితుల బలవంతం 

వద్దురా ఇది మాములుది కాదు
మా బతుకులు చిద్రం చేసిన రాకాసి
మా నాన్నని బానిసను చేసుకొని
మా బతుకులని బుగ్గి చేసిన మత్తు దయ్యం

దాని జాడలు కావాలా మా అమ్మ
చిందించిన నెత్తుటి చుక్కలనడుగు
బొట్టు బొట్టుగా కార్చి ఇంకిపోయిన
కన్నీటి చుక్కలనడుగు
మా ఇంటి గోడలనడుగు
నాన్న చేతిలో మెలవేయబడ్డ అమ్మ
జుట్టుని అడుగు


మత్తులో జోగుతూ ఎక్కడెక్కడ పడేవోడో
ముళ్ళకంప, చెరువు గట్టు ,చెత్తకుప్ప తొట్టి
బురద గుంటా ఈయనా చిరకాల స్నేహితులే

ఒక్కసుక్క గొంతు దిగితే సుక్కలదాక
ఎల్లోచ్చేవాడు మా నాన్న
ఇల్లు ,పొలం ఇంటి సామాను
తాళిబొట్టు, కాదేది తాకట్టుకి అనర్హం
మా నాన్నకి

అలంటి రొంపిలో నే దిగలేను
మా నాన్న అంటించుకున్న కంపు, కంప
నే తగిలించుకోలేను
కుళ్ళబెట్టి నానబెట్టిన ఆ మహమ్మారిని
నెత్తిన పెట్టుకోలేను..................బళ్ళున పగిలింది సీసా
నా స్నేహితుల అనుమానం లానే
ఏదో తెలీని మార్పు
బాద కనిపించలేదు వారికళ్ళలో
సీసా పగిలిందిగా మరి