నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, April 27, 2013

॥ ఎక్కడికి పోగలం॥
ఎక్కడికి పోగలం
ఇక్కడ ఇన్ని బాద్యతలు
భుజానికెత్తుకున్నాక
ఈ లోకాన్ని వదిలి


కొన్ని కన్నీటి చారల్ని
చెంపలపై ముద్రించుకుని
ఆ మరకల్ని చెరుపుకోకుండా
చెమర్చిన కళ్ళతో వీడుకోలు
ఎలా చెప్పగలం

ముళ్ళ బాటలో నడుస్తూ
చీరుకు పోయిన గతం తాలూకు
నెత్తురోడుతున్న
జ్ఞాపకాల గాయాలు
మాన్పకుండా ఎలా
వదిలేయగలం

జీవన పోరాటం లో
ఎదురొడ్డి నిలుచున్నాక
పగిలిపోయిన పక్క వాడి
జీవితాన్ని చూస్తూ
యుద్ధం ఆపుతూ పొతే
మన జీవితపు పగుళ్ళు
పూడ్చకుండా
ఎలా వదిలేయగలం


జ్వలించడానికి
సిద్దపడ్డాక
ఆహోతైనా సరే దీపంలా
వెలుగు పంచాల్సిందే
విరిసినా వాడినా మౌనంగా
ఉండేందుకు పూలభాష నేర్చుకోవాల్సిందే
పిట్టలు తిని వదిలేసిన ఇంకాకొన్ని గింజలు
మన పేరుమీదనే ఉన్నాయి


కదానాయకుడే డీలా పడితే ఎలా
కదా నడవాలికదా
సశేష ప్రశ్నలకి అశేష సమాధానాలిస్తూ
నాటకం చివరి అంకం వరకూ

No comments:

Post a Comment