నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Friday, April 26, 2013

॥ యథాలాపంగా ॥
నడి రోడ్డుపై సూర్యుడు పెత్తనం చెలాయిస్తున్నాడు
నిశబ్దాన్ని ముక్కలు చేసి సర్రున దూసుకేళ్తుంది గాలి
చిల్లర పడని చిరాకులో బిచ్చగాడు దిక్కులు చూస్తున్నాడు
పూలపై తుమ్మెదలు రెక్కీ నిర్వహిస్తున్నాయి

బజారులో ఎక్కడో బాంబ్ పేలింది
స్నిఫర్ డాగ్ మసీదులో వాసన చూస్తోంది
వేకువ ఝామున జవాను సమయం సరిచేస్తుంటే
ఊరికే పడున్న ఉరికోయ్యలను నిద్ర లేపుతున్నారు కొందరు

అమ్మ చనుపాలు తమ్ముడు తాగుతుంటే అన్న గుర్రుగా చూస్తున్నాడు
గొంతులో దిగిన మందు ప్రభావంతో కొన్ని గొంతుకలు
జిందాబాద్ , ముర్దాబాద్ లుగా కొట్టుకుంటున్నాయి
ఎవరో తినిపారేసిన విస్తరికోసం
రేపటి పౌరులు కుక్కలతో కాట్లాడుతున్నారు

గోడపై పోస్టర్ చూడలేక బురదనీళ్ళు కొట్టి పోయాడు ఓ డ్రైవర్
రెక్కలు తెగిన మానవత్వపు పావురం
చివరి శ్వాస విడుస్తుంది మినార్ కి మందిరానికి మద్యలో
గాయపడ్డ సూరీడు నెత్తురు కక్కుకుంటూ రాలిపోయాడు
ప్రభాతానికి కర్ఫ్యూ లేకుంటే
రేపటికి వస్తాడో లేదో

No comments:

Post a Comment