నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, January 8, 2013

కాగితం
శూన్య విలువ ఆపాదింపబడి 
నిశ్చలంగా , దిగంబరంగా 
గాల్లో తిరుగుతూ ఓ తెల్లకాగితం 

తెల్లకాగితం...................... 
ఎవరికీ నచ్చిన రాతల్ని వాళ్ళు 
రాసుకుంటూ , గీసుకుంటూ 
నచ్చకపోతే చింపే స్తూ .. పాపం 
పలుచని చర్మం కదా అలుసే మరి 

పలుచటి చర్మమా ఐతేనేం 
ప్రపంచ నిర్దేశి కాగితం 
కొన్ని సిరా చుక్కల్ని పోగేసికుని 
కొన్ని రంగుల్ని అద్దించుకుని 
అక్షర మాలని మేడలో వేసుకుని ముస్తాబై 
వార్ధక్యం లేకుండా తన వాదన వినిపిస్తూనే ఉంది 

వార్ధక్యం లేదు కాగితానికి 
ఓ విద్యార్ధికి పాఠాన్ని నేర్పుతూ 
ఓ కవి కవిత్వాన్ని చేరదీసుకుంటూ 
ఓ చిత్ర కారుడి కుంచె భావాల్ని అనువదించుకుంటూ 
ప్రేమికుల భావాలని ఆలింగనం చేసికుంటూ 
కాగితం సాఫల్యం చెందుతుంది 

సాఫల్యం చెందడమంటే 
దారిలో ఎదురైన సవాళ్ళని 
ఓపికగా ఎదుర్కోవడం ఓ యోధుడిలా 
కాగితం యోధుడే 

కాగితం యోధుడే 
చింపి పారేస్తారని తెలిసి 
ఎదురొడ్డి నిలుస్తుంది తాను కలం ముందు 
మంచు పల్లకీలు కట్టినా దానిమీదే 
మహార్నవాలు నిర్మించినా దానిమీదే 
ఇందరి భావాల్ని ఒడిసి పట్టుకున్న 
కాగితం ఒక చారిత్రిక అవసరం

చారిత్రిక అవసరానికి మరకలెన్ని పడ్డా 
తనకి తానుగా మకిలి పడనిది కాగితం 
అందుకే కాగితం ఒక శాంతి కపోతం 
ఈ ప్రపంచానికి

1 comment: