నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Friday, January 11, 2013

|| సహృదయ రాయబారి ||


గుమ్మానికి ఆవల
తలుపుకి చాటుగా  చేరబడి 
బయటి మాటలు వింటూ 
నాన్న గొంతుకి వణుకుతూ అమ్మ 

తన వద్ద కన్నీళ్ళకి కొదువే లేదు 
అందరి కష్టాలకి తనే స్పందిస్తూ  
పేరుకే పెత్తనం, ఒరిగిందేం  లేదు తనకి 
అందరి తిట్లు చివాట్లు, నిష్టూరాలు  తప్ప 

నిజానికి అమ్మ
ఒక సహృదయ రాయబారి 
నాన్నకి పిల్లలకి మద్య 
ఇద్దరి మాటలని చేరవేసే ఓ మాద్యమం 

ఎవరేమన్నా సరే ఎదురు చెప్పలేక 
చీర కొంగుతో కళ్ళని ఒత్తుకుంటూ 
కష్టాలకి అమ్మ బ్రాండ్ అంబాసిడర్ 

అమ్మంటే  ఆకలి ,అమ్మంటే  దాహం 
అమ్మంటే  నిద్ర , అమ్మంటే  సౌకర్యం 
అమ్మంటే చనువు , అమ్మంటే మదుపు 
గుమ్మానికి కట్టిన శాశ్వత పచ్చని తోరణం అమ్మ 
ఏపని ఏమూల మొదలెట్టినా 
ఆగేది అమ్మ దగ్గరే 


తానూ ఉండలేని చోట్లలో అమ్మ నుంచాడు దేవుడు 
అందుకే దేవుడిని నమ్మని వాడు అమ్మని నమ్ముతాడు 
అమ్మేలేకుంటే  ఆడపిల్లని అమ్మేవాడు ఉండడు 
చెప్పుకుంటూ పోతే ఈ వాస్తవానికి అంతే  ఉండదు

Tuesday, January 8, 2013

కాగితం
శూన్య విలువ ఆపాదింపబడి 
నిశ్చలంగా , దిగంబరంగా 
గాల్లో తిరుగుతూ ఓ తెల్లకాగితం 

తెల్లకాగితం...................... 
ఎవరికీ నచ్చిన రాతల్ని వాళ్ళు 
రాసుకుంటూ , గీసుకుంటూ 
నచ్చకపోతే చింపే స్తూ .. పాపం 
పలుచని చర్మం కదా అలుసే మరి 

పలుచటి చర్మమా ఐతేనేం 
ప్రపంచ నిర్దేశి కాగితం 
కొన్ని సిరా చుక్కల్ని పోగేసికుని 
కొన్ని రంగుల్ని అద్దించుకుని 
అక్షర మాలని మేడలో వేసుకుని ముస్తాబై 
వార్ధక్యం లేకుండా తన వాదన వినిపిస్తూనే ఉంది 

వార్ధక్యం లేదు కాగితానికి 
ఓ విద్యార్ధికి పాఠాన్ని నేర్పుతూ 
ఓ కవి కవిత్వాన్ని చేరదీసుకుంటూ 
ఓ చిత్ర కారుడి కుంచె భావాల్ని అనువదించుకుంటూ 
ప్రేమికుల భావాలని ఆలింగనం చేసికుంటూ 
కాగితం సాఫల్యం చెందుతుంది 

సాఫల్యం చెందడమంటే 
దారిలో ఎదురైన సవాళ్ళని 
ఓపికగా ఎదుర్కోవడం ఓ యోధుడిలా 
కాగితం యోధుడే 

కాగితం యోధుడే 
చింపి పారేస్తారని తెలిసి 
ఎదురొడ్డి నిలుస్తుంది తాను కలం ముందు 
మంచు పల్లకీలు కట్టినా దానిమీదే 
మహార్నవాలు నిర్మించినా దానిమీదే 
ఇందరి భావాల్ని ఒడిసి పట్టుకున్న 
కాగితం ఒక చారిత్రిక అవసరం

చారిత్రిక అవసరానికి మరకలెన్ని పడ్డా 
తనకి తానుగా మకిలి పడనిది కాగితం 
అందుకే కాగితం ఒక శాంతి కపోతం 
ఈ ప్రపంచానికి

మిత్రమా

అడ్డ దిడ్డంగా 
కాలాన్ని పగలగొట్టి 
ఆ ముక్కలపై కర్కశంగా 
కరాళ నృత్యం చేస్తుంది 
"చీకటి" తనలో తాను 


కొన్ని గుండెల చప్పుడుని 
లెక్కచేయకుండా 
కూడికల తీసివేతల 
విభజన రేఖని నేర్పుతుంది 
జనాలకి రేఖమాత్రంగా 
ఒక "తప్పు "

వెలుగు కొమ్మలు తెంచడానికి 
చీకటి చివ్వున లేస్తుంది 
"అణచబడే కోరికలు" అలానే ఉంటె 
చీకటికి వెలుగంటే లోకువే

ఏం చేయగలిగావు మిత్రమా 
వెళ్ళిన కాలాన్ని ఆపగాలిగామా 
గడచిన గంటల్ని గుణించామా
లోక కల్యాణం కోసం లేదే 
అవునులే మనదెం పోయింది 
గతంలో కలిసి పోయింది కాలమేగా

రంకెలేస్తున్న రాజకీయం 
ముక్కుకి తాడేసి 
నడిబజారులో మీసం తిప్పి 
నడిచే యోధుడి కోసం 
దేశం చూస్తుంది

రా ....నీతి వెలుగుతో 
అవినీతిని పంపెద్దాం 
అనంత బిలంలోకి 
చీకటిని తోక్కేద్దాం 
నీతనే నిప్పుల ఊబిలోకి

Tuesday, January 1, 2013

|| నేల ||నామీద కోపం ఎందుకు నేల కి 
అప్పుడెప్పుడో  నేను పుట్టినప్పుడు భూమ్మీద పడ్డాను అన్నాడు నాన్న 
ఆ తరవాత ఎన్నో సార్లు పడ్డాను అదే నేల మీద 
తేడా ఏంటో అర్ధం కాలేదు చిన్నతనం లో  

కొన్ని సార్లు సూరీడు తనమీద  కోపం చేస్తే నా కాళ్ళని కాల్చేది 
కొన్ని చినుకులు పడితే చిరాకుతో నన్ను పడేసేది 
నాకు దొరికే సమస్తం తనే ఇస్తుంది పాపం ఎప్పటి నుంచో 
అందుకే ప్రేమ నాకు ఈ నేల అంటే 
నేల నాకెప్పుడు అర్ధం కాదు 

కొన్ని యుగాలకు సరిపడా దాచుకున్న తన సంపదని 
తన గుండెకే  రంద్రాలు చేసి పిండుతున్నా బాధకి ఓర్చి 
మనల్ని  అమ్మలా చూచుకుంటుంది  నేల
తనని కొంతమంది దోచుకుంటున్న సరే .....ఏంటో ఈ ప్రేమ
నేల నాకెప్పుడు అర్ధం కాదు 

ఎందుకో ఈ మద్య  నేల  అలిగింది అన్నం పెట్టను అంటుంది 
దాహం గా  ఉంది నీరు ఇమ్మంటే లెవ్వు పొమ్మంటుంది 
నిర్దయగా చంపేస్తుంది పొలాలని 
సూరీడు కోపానికి గుండె పగిలిందేమో 
అప్ప్పుడప్పుడు నెర్రెలు విడుస్తుంది తనూ కన్నెర్ర చేస్తూ 
నేల నాకెప్పుడు అర్ధం కాదు 

పురుగులు చంపాల్సిన మందులు నేలని చంపుతున్నాయి 
తనని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తుంటే 
పాపం నేల తానూ అన్నిభరిస్తూ మనల్ని బతికిస్తుంది 
జలగల్లా తన నీటిని పీల్చేస్తున్న కొన్ని చుక్కలైనా తనకి లేకుండా 
మళ్లీ మనకిస్తుంది ఏ స్వార్ధం లేకుండా 
నేలని చంపేది మనమే నేమో ...........
ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది 
నాకు ఎప్పటికి అర్ధం కాని నేల 
.....................................................తేది :01.01.2013