నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Thursday, December 20, 2012

పండగ నాడుఆశల దారాలు  పేని కొత్త బట్టలు 

వేసుకుందామని ఆశ 
ఈ ఒక్క నాడైనా మసిబారిన మట్టికుండలో 
కొన్ని మెతుకులైనా వండాలని ఆశ     

ఎండకి ,ఎండిన నేలకి మధ్య నలుగుతున్న
పాదాలకి తొడుగులు తొడుగుదాం అని ఆశ 
ఈ ఒక్క నాడైనా పది దినాల క్రితం వెలిగించిన పొయ్యిలో 
రంగు చమురు పోసి వెలుగు రేఖల్ని వెలిగించాలని ఆశ 

ఈటెల్లాంటి మాటలు ఇరుగు పొరుగు నుంచి 
ఆసామి కాడికెళ్ళి  పుస్తేలైన తాకట్టు పెట్టి ఆశలన్నీ పండించుకోవాలని 
ఈ ఒక్కనాడైనా ఏడ్చి ఏడ్చి డొక్కలు ఎండిపోయిన 
బిడ్డల కడుపు నిండా కొన్ని మెతుకులు నింపుదాం అని ఆశ 
ఒక్కనాటి వెలుగు కోసం పుస్తేలమ్మితే 
ఇంటిదాని కళ్ళలో నాపై కోపం 
ఈ ఒక్క నాడైనా ఆ కోపాన్ని కరిగించేసి ఇక 
ఎప్పటికి చూడకూడదనే ఎండమావి ఆశ 

పండగంటే పండగే ................
పేదోడికి కూడా పట్టెడన్నం పెడుతుంది ఆ పూట 
కొన్ని బతుకులు అంతే కొన్నిన్టికోసం ఎదురు చూస్తూ 
కొన్ని త్యజిస్తూ 
పండగ తెల్లరినుంచి అప్పిచ్చిన ఆసామి తిట్లని భరిస్తూ 

మళ్లి ఎదురు చూపు పండగ కోసం 
మా కళ్ళలో వేయి దీపాల కాంతి కోసం 
అదే ఆశలో ................................

Thursday, December 13, 2012

అక్షరాలు

అన్ని మెలికలు నావల్లకాలేదు 
తిప్పి రాయడానికి 
అనంత మైన ఓపిక నాకు లేకపోయింది 
అన్ని సార్లు దిద్దడానికి 
ఓ వైపు చెడుగుడు 
మరో వైపు క్రికెట్టు 
అబ్బో అప్పట్లో అవే మన నేస్తాలు 

ఓ గుప్పెడు అక్షరాలు  జేబులో వేసుకుని 
నేమరేసుకున్దామని ఆలోచనేలేదు 
ఓ పుంజీడు  పాఠాలు బట్టీయం  వేసి 
బతుకులో సాగుదామనే కోరికా లేదు 
అదో లోకం నిర్లిప్తంగా ..నిస్తేజంగా 

కొన్ని వందల కోణాల ఆలోచనలు 
త్రికోణమితి తప్పించుకునేందుకు 
భారమితి ,పాదరసం ఇవేమీ ఎక్కలేదు 
అక్కరకు రాని చుట్టమనే భావన నాకు చదువంటే  
తెలీనేలేదు నాకు చదువంటే 
విరుతించే ప్రణవ నాదం అని 

గుప్పెట్లో  ఇసకమాదిరి 
జీవితం చేతి వేళ్ళ సందు లోనుంచి 
జారిపోతుంటే 
అక్షరాలూ నేర్పించే పాఠాలు 
ఎంత విలువైనవో అర్ధం ఐంది ఇప్పుడు 

భారమైన బతుకు లోనుంచి పుట్టిన మాట 
హటాత్తుగా అక్షరాన్ని గుర్తు చేసింది 
స్పష్టంగా అగపడుతున్నాయి ఆ రోజున 
నేను తిప్పలేని మెలికలు 
లేని ఓపిక తెచ్చుకుంటున్నాను 
రాసిన అక్షరాలనే మళ్లి మళ్లి రాసి 
శరాలుగా  మార్చి సంధించేందుకు కవిగా 

బల్ల నల్లదే సుద్దముక్క తెల్లదే 
కాని అదే అజ్ఞానాన్ని పోగొట్టే రవికిరణం 
"ఇప్పుడు జీవితాన్ని ఇస్తున్నాయి 
ఎప్పుడో  దిద్దుకున్న అక్షరాలు "

Tuesday, December 4, 2012

పార్కుల్లో ప్రేమ


సంధ్య సమయం సాయంత్రం నాలుగు గంటలు 
కొన్ని ఫోన్లు మోగుతాయి కొన్ని మెసేజ్ లు 
సందేశం ఇస్తాయి, కలుసుకోవాల్సిన చోటేదో 

ఇప్పటి దాక గాలికి చెట్లే ఊగుతాయి అని తెలుసు 
ఇక్కడదే  విచిత్రం పొదలు కూడా ఊగుతాయి గాలి లేకపోయినా 
పాపం పచ్చని చెట్లు వెచ్చని శ్వాసలతో విలవిలాడుతుంటాయి  
సిగ్గేసి సంద్యలోకి జారుకుంటాడు సూరీడు వాళ్ళ చేష్టలు  చూడలేక 

రోజూ  వచ్చే జంటలని చూసి చంద్రుడు బెంబేలెత్తుతాడు 
దెబ్బ తగలకుండా గాలి సుతిమెత్తగా దెబ్బ వేస్తుంది అది తప్పు అని 
హన్నన్న ఎంత మాట పార్కు మాకో ప్రైవసీ గది అంటూ తెలివిగా 
తప్పుకుంటున్నారు  ప్రేమికుల పేరు మాటున వంచకులు 

ఇక్కడి నవ్వులన్ని ప్లాస్టిక్ పువ్వులే 
రంగు రుచి చిక్కదనం లేని ప్రేమలన్నీ ఇక్కడే ఉంటాయి 
ఒకో రోజు ఒకరితో పాపం రొజూ ఒకరే ఐతే బోర్ కొట్టదు  మరి 
కాలక్షేపం బఠానీలు, పల్లిలు,పసందైన ఐస్ క్రీములు 
డబ్బుంటే పార్కుల్లో గడ్డికూడా రుచే 

పచ్చని వాతవరణాన్ని  రసాత్మకంగా మార్చే ఉద్దండులు వారు 
వారికి తెలీదు పాపం కొన్ని తలలు దించు కుంటున్నాయి వారిని చూసి అని 
వారికేం తెలుసు కొన్ని కెమెరా కళ్ళు  విచ్చుకుని చూస్తున్నాయని 
వారికేం తెలుసు బాగోతం బయటపడితే పోయేది కన్నోళ్ళ  పరువే అని 

మెల్లిగా బయటకి వస్తుంటే కాల్లో దిగబడింది ముల్లులా 
ఎవరిదో పగిలిన హృదయం అనుకుంటా 
తన జంట హృదయం మరొకరితో పార్క్ లోపలికేలితే 
బయట పగిలి ముక్కలైందేమో జాలి చూస్తూ దాటేసా 
"జిందగీ దోబారా న మిలేగా "పార్క్ గోడపై పోస్టర్ 
తెలిసో తెలీకో అంటించాడు పోస్తర్లవాడు