నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, October 16, 2012

ఎడబాటు ........

ఎడబాటు ........

ఎడబాటు తేలికేం కాదు 
నువ్వు పలికినంత
 చిన్న పలుకేమి కాదు 

లేత గులాబీని రేగుముల్లుతో 
చీల్చినట్టు చేసిందామాట
నా గుండెను చూడు ఎంత ప్రేమ 
స్రవిస్తుందో  నెత్తురు లాగా 

మనచూపులే భయం నిండిన 
కనులతో భారంగా  కిందకి దిగుతున్నాయి 
సంధ్యా సమయాన సూర్యునిలా 

నా ఊహలో అందే కట్టని నీ పాదం 
నిష్క్రమణ అడుగుల సవ్వడి
వందల సైన్యం కవాతు చేస్తున్న 
శబ్దాలతో కంపిస్తుంది నా గుండె 

ప్రాణం పోవడం అంటే ఇదా 
నువెళ్ళి పోతున్నావనే  ఊహతో 
నాకు తెలిసొస్తుంది 
కన్నీళ్ళు పోసి పెంచలేను
మన ప్రేమ మొక్కని నీ ఎడబాటుతో 

నువ్వు లేకపోయినా నీ ఊహ ఉంది నా దగ్గర 
ఊపిరి భారమైనా నీ తలపులనే శ్వాసిస్తూ
ఎడబాటు కారణాలను అన్వేషిస్తూ 
సాగుతున్నా ఎడబాటు దురాన్ని దగ్గర చేసేందుకు 
అది జరుగని క్షణాన .................

సందేహమే లేదు సమిధను అవుతాను నీకోసం 
ఎడబాటు తట్టుకోలేక 
నీ ప్రేమను ప్రేమిస్తూ నిరంతరం

No comments:

Post a Comment