నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, October 16, 2012

అవసరం
మంచుకురిసే సాయంకాలంలో 
గోడమీద వయసుపిలిచింది వాల్ పోస్టర్ చూస్తూ 
బిర్యాని ,బీరు  బాకీ పోగా మిగిలిన నోట్లని లెక్కిస్తూ 
ఆత్రంగా వెతుకుతున్నాయి నా కళ్ళు 
నా దగ్గర గాంధి బొమ్మలకి ఎన్ని అందాలు 
అరువు తెచ్చుకోవచ్చో అని ఆలోచనలు 
ఆవర్జలేస్తుంటే కాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాయి 

జారుతున్న పవిటలన్నీ జానెడు పోట్టకోసమే
స్టూడెంట్, పరిక్ష ఫీజు కోసం అంట అదృష్టం అంటే నీదే 
కర్ణ భేరిని వాయించే మాటవింటూ
నోట్లను పర్సు గుండె నుంచి ఖాళి చేస్తూ 
అస్పష్టపు వెలుతురులో అందాలని బేరీజు వేస్తూ 
ఒక్కమనిసి ఇన్ని పనులా ,అవసరం అలాంటిది మరి 

మంచు కరుగుతుంది వేడి నిట్టుర్పుల మద్య 
పదినిముషాలే చాల్లే మళ్లీ రేపు రావచ్చు 
కానీ ఈ విందు దొరకదేమో చిన్న లాజిక్ 
అడుగుదామంటే అహం అడ్డొచ్చి మొహం చాటేసా

లేబర్ వార్డులో ఓ  ఏడాది తరువాత 
సుఖానికి ప్రతిఫలం నా భార్యకో  బిడ్డ
థాంక్ గాడ్ ఇద్దరు క్షేమమే 
పక్క వార్డులో గోల ,ఎవరో బిడ్డను మాయం చేసారు 
ఇదంతా మామూలేగా బిడ్డపుట్టిన ఆనందంలో నేను 
ఎవరో స్టూడెంట్ అంట బావ ఇంట్లో తెలీదంట ఈ డెలివరి 
బిడ్డ పోయిందని గోల 
బామ్మర్ది వార్త - గుండెల్లో దిగిందో గునపం 
ఆమె ఈమేనా ఏమో ఏడాది క్రితం  ఎలా చెప్పడం  
మొహం కూడా చూడలేదు మోహపు ఆవేశంలో 

కాళ్ళు  ఇప్పుడూ తీసుకెళ్తున్నాయి నన్ను రోడ్డు పైకి 
నాలుగు మాటల చౌరస్తాలో నిలదీయడానికి 
కుక్కలు కొట్లాడుకుంటూ అరుస్తున్నాయి 
అప్రయత్నంగానే చూసా  ఎవరో బిడ్డ 
అయ్యో ! మేలుకుంది మానవత్వం 
అప్పటికే  ప్రాణం పోయింది పాపం 

నేను చేసిన పాపమేనా ఇది 
నాలాంటి వాడు ఇంకెవడన్నా నా 
ఏమో ఇప్పుడు నా అంతరాత్మకి 
నేనేం సమాధానం చెప్పాలి
ఇంతకీ ఆమె ఎలా ఉందొ పాపం 
ఆమె ఈమేనా పోలికలు గుర్తించే ఉద్యోగంలో నేను 
ఐయినా కాకపోయినా తప్పు తప్పే 
ఒక సుఖం కోసం ఒక బిడ్డ చావు 
బిడ్డ నిజంగా పోయిందా లేక ఆమె పంపెసిందా, విసిరేసిందా
ఎటూ తేల్చుకోలేని నేను 
ఎప్పుడో చూసిన మాటను తలచుకుంటూ 
"కన్న ప్రేమ తరిమేస్తుంటే 
 చెత్తకుప్పలు తల్లులు అవుతున్నాయి "
నా భార్య వైపు వెళుతున్నా 
నిజం ఒప్పుకుందామని
ఇప్పుడు అది చాలా అవసరం 


No comments:

Post a Comment