నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, September 1, 2012

పాడుబడ్డ బావి
వూరి చివరోళ్ళ నీళ్ళ కోసం కామందు
తవ్వించిన బావి 
చుట్టూ గచ్చునేల మద్య వెదురు బద్ద 
ఇనప గిలక అంతా పెళ్లి కూతురు ముస్తాబు 
ఎన్ని ఇళ్ళు తడిపిందో అవి కట్టినప్పుడు 
ఎన్ని పెళ్ళిళ్ళుకి నీళ్లిచ్చిందో ఆ బావి 
మా పేట పెద్ద ముత్తైదువు 

పెద్ద కామందు కన్ను పడింది 
కామేసుగాడి కొత్త పెళ్ళాం మీద 
సుక్కేసిన కామేసుగాడేమో
కామందు సావిట్లో
కామందేమో కామేసు గాడింట్లో 
పాపం ఆ పిల్ల ఆర్తనాదాలు 
వినపడ్డ గుడిసెల తలుపుల్లన్ని 
బిర్రుగా బిగుసుకున్నాయి 
కొరడా దెబ్బలు వూరి వెలివేతలు
గురుతొచ్చి

కేకలేన్ని వేసినా గుళ్ళో దేముడు 
కూడా రాలేదు 
రాయికదా వినపడలేదేమో
లేక వూరి బయట దళితులనేమో 

పాపం దిక్కుతోచని ఆ పిల్లకు 
ఈ పెద్ద ముత్తైదువ దిక్కయింది 
ఏడుస్తూ ప్రాణం పోయినా 
పతివ్రతలాగే పోవాలని 
అందులో దూకింది అంతే

బావిని మూసేశారు 
పెద్ద ముత్తైదువ ని విధవని చేసారు 
నీళ్ళతో కళకళ లాడేది పాపం 
నీళ్ళు తోడి పలకరించే నాధుడు లేక 
బాదతో బావి గుండె కుదించుకు పోయింది 
నీరు మొత్తం నేలలోకి ఇంకిపోయింది 

ఒక కామందు కామానికి 
ఒక ప్రాణం బలియై దయ్యమై 
తిరుగుతుంది బావి కాడ
ప్రజల అనుమానపు పొరల్లో

అణిచివేత ప్రజలపైనే కాదు 
ఊరి చివరోళ్ళ అవసరాలమీద 
కూడా అని అందరికి పాఠం
చెప్తుంది ఊరిచివర మా పాడుబడ్డ బావి 
హృదయ విదారకం గా ఏడుస్తూ 
మా ఊరిచివర పేట లాగా

No comments:

Post a Comment