నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Saturday, August 25, 2012

బోధి చెట్టు కింద బుద్దుడేరచ్చబండను ఆనుకుని రావి చెట్టు 
చిల్లులు పడ్డ నల్లని గొడుగు నీడన 
ఆరే బొడ్డు కొస్తే పుట్టాను నేను 
నన్ను తయారు చేసిన వాడు 
భారతమాత కడగొట్టు బిడ్డ 

తన రంగు నాకంటించి 
వూరి పాదాలు కందకుండా చేసే నేర్పరి 
వూరు మొత్తం నడుస్తుంటే తాను తలొంచుకుని 
కళ్ళతో పాదాలవంక చూస్తూ తన తలపులో 
ఏ కాలికి ఏ జోడు కావాలో కలగనే చిత్రకారుడు 

తన కరకు  చేతులతో ప్రేమగా   
ఆరెతో కోసినా గూటం తో మేకులు పొడిచినా 
దారంతో నన్ను బిగించినా నా కిష్టమే 
నన్ను తయారు చేసే సమయం లో అతనో దేవుడు 
కాలికి తొడిగి  నన్ను పంపే సమయం లో కన్న తండ్రి 
తెగిపోయినా ,అరిగిపోయినా నను బాగుచేసే వైద్యుడు 
చిన్న చిన్న పనులకి పైకం తీసుకోని పరోపకారి 

తనలా   మాసిపోయిన  తన పరదా మీద ఉన్న నేను 
స్తాన్డులోకి చేరాను కాల క్రమంలో 
పెద్ద యంత్రాల పళ్ళ మద్య 
అటు ఇటు తిప్పబడి గతిదనంలేక ఓటిగా తయారై నాను 
రాగి చెట్టు నీడ లో వుదకజని పీల్చుకునే నేను 
చలిమర గదులలో బిగుసుకుపోతున్నా

నా మెడకో తాడుకట్టి దానికో రేటు కట్టి 
డబ్బాలో పెట్టి రంగు రంగుల విషవలయం లోకి 
నన్ను మార్చి అమ్ముతుంటే 
మౌనం గా మమ్మల్ని కన్న మారాజుని తలుచుకొని 
మౌనం గ తలవంచుకున్నా

ఎంత ఎదిగినా నేను చెప్పునే నన్నేం రాజుని చేయరు 
మీకు నేను ఖరీదైతే కావచ్చు ,పాలీషు మెరుపుల్లో 
మెరవచ్చు 
తరిమేయొచ్చు మీరందరూ నా తండ్రిని 
జనారణ్యం లోనుంచి 
మీకే అంటరానివాడు 
నాకు మాత్రం బోధి చెట్టు కింద బుద్దుడే 

2 comments:

  1. నాకు మాత్రం బోధి చెట్టు కింద బుద్దుడే

    చాలా అద్భుతంగా చెప్పారు సార్..మీ రచనలు బాగున్నాయండీ స్పూర్తిదాయకంగా.

    ReplyDelete