నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, February 5, 2013

|| ఎదురుచూపు ||కొన్ని సార్లు మనకన్నులు దారెంటే చూస్తుంటాయి
ఎన్ని దృశ్యాలు ఎదురైనా దాటేసుకుంటూ
అలసిపోయినా రెప్పవేయకుండా

రేయేదో పవలేదో తూచలేవు ఆ చూపులు
రంగులెన్ని పులుముకున్నా సరే
అనుకున్న దృశ్యం అగుపించేదాకా
మసకతెరలే కంటి నిండా

బరువైన రెప్పల్ని తనకోసం బలిచేస్తూ
ఆలోచనల ఆవర్తనాలలో పరిబ్రమిస్తూ
ఊహలనిప్పుల కొలిమిని రాజేస్తూ
చూడబోయే దృశ్యం కోసం
చూపులని గాల్లోనే వేలాడదీస్తూ
సమయాన్ని తొలుచుకుంటూ
ఎదురుచూపులు సాగుతుంటాయి

కోతకొచ్చిన పంటలా
వర్షించబోయే మేఘంలా
దాహార్తిలా , వేకువ ఝాములా
తదుపరి ప్రక్రియకోసం ఎదురుచూస్తూ
ఎదురు చూపులు నిజంగా ఎండమావులే

మసక తెరలని తుడిచేస్తూ
కాంతివేగంతో కనపడ్డ దృశ్యాన్ని
ఆలింగనం చేసికుంటూ
ఆనందం లో పెనవేసుకున్న
చూపుల చిక్కులు విడిపోవేమో

"ఎదురుచూపుల చిత్రం
ఎంతచూసినా తనివితీరని విచిత్రం"

2 comments: