నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Monday, September 3, 2012

ఇక్కడంతా క్షేమం


ఇక్కడంతా క్షేమం 
నేను నాతో బాధలు 
అంతా క్షేమమే 

ఉషస్సు లాంటి జీవితాన్ని 
సాయం  సంధ్యకిచ్చి చేసిన పెళ్లి 
మధ్యానపు ఎండలా మండుతోంది 

నెత్తి మీద పడ్డ అక్షింతలు పచ్చటి 
జీవితాన్ని గుర్తు చేస్తుంటే 
ఆశల అశ్వంపై సవారి చేస్తున్నా
పంటి బిగువున బాధను భరిస్తూ 

అందరూ నా వాళ్ళే నేనొక్కదాన్నే 
పనిమనిషిని వాళ్ళ మద్యలో 
అన్ని నాతోనే పంచుకుంటారు 
కోపం బాధ అసహ్యం అనుమానం 
వివిధ  రూపాల్లో రోజూ  దెబ్బల తో 

జీవితపు సీరియల్ లో నాదో
కథానాయిక పాత్ర 
కథ లో ప్రతీ పాత్ర 
 నా చుట్టూనే తిరుగుతుంది 
తిడుతూ కొడుతూ 

సాటి  ఆడదనే ఆలోచన అత్తకు రాదు 
ఆడబిడ్డ అసలు ఆడదే కాదు 
మరిది బెల్టుకి అత్త చేయి ఆసరాగా 
మారి నా వొంటి రంగుని మారుస్తుంది రోజు 

అన్నీ నావే నేనే దూరం అన్నింటికీ 
ప్రేమ జాలి నామీద నాకే 
అసహ్యం ఈ వ్యవస్థ మీద 
నాలా కొడిగట్టే దీపాలు ఎన్నో 
అన్ని సమిధలు అనుకుంటే పొరబాటే 

నిలిచి గెలిచి నా పాత్ర కు న్యాయం చేసి 
విజయబావుటా ఎగరేస్తాను 
అస్త్ర సన్యాసం చేస్తే యుద్ధం ఆగదు
యుద్ధం అంటే చావడం చంపడం కాదు 
శత్రువుని వోడించడం గెలుస్తా నిలుస్తా 

No comments:

Post a Comment