నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Wednesday, September 12, 2012

పల్లకీలో దేముడు

గూడెమంతా  సందడి 
పండగేం  గాదు
పతంగులు ఎగరలేదు 
సాయిబులు పీర్లు ఎత్తలేదు 
గాని అంతా వూదుకడ్డీల వాసన 

కిర్రుచెప్పుల సవ్వడి 
గుళ్ళో చదివే వేదాలు 
భజన కీర్తనలు,తాళాల చప్పుడు 
గాలి మోసుకొచ్చింది చెవుల్దాకా 

పూల పల్లకీలో దేముడు 
మా అంటరాని పేటలో 
ఎప్పుడో జమానా నుంచి 
ముంతా తాటాకు కట్టి 
విసిరేసిన  గూడేనికి
హవ్వ ! ఏంటి విచిత్రం 

అరవై ఏళ్లనుంచి నంజుకు తినబడుతున్న 
నాల్గో జాతి వీధిలోకి నరసింహ సాములోరు 
ఉరేగి పోయినాడు 
కళ్ళారా చూద్దామంటే ఆపిన నాథుడే లేదు 
పాపం పూలని మాత్రం చంపారు దేవుడి   పేరు జెప్పి 

ఊరికి కరువొచ్చినట్టు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు 
పౌర్ణమి రోజున వెన్నెల కాసినట్టు 
ఒక్కసారే వస్తాడంట దేముడు మా గూడేనికి

నల్ల దొరల రాజ్యం ఆర్తిగా పిల్చినా 
ఆలకించడేమి  దేవుడు 
చిక్కుకున్నడా దేవుడుకూడా మీ 
కబందహస్తాల్లో మా జీవితంలానే 

దేవుడు ని మా గూడేనికి తేవడం కాదు 
మమ్మల్ని తీసుకుపోండి 
మీ గుడిలోకి బడిలోకి మీ ఇళ్ళకి 
మీ మనసుల్లోకి 
కడుక్కోండి మీ మసులని 
మానవత్వపు జలం తో 

కుదిరిందా సరే సరి 
లేకుంటే ఈ సారి మీరు తెస్తే వచ్చేది 
ఒట్టి విగ్రహమే దేవుడు కాదు 
పైవాడికి తెలీదా మీ కులం 
రంగేసుకున్న  నాటకాలు (12sep2012)

7 comments:

  1. కవిత బావుంది చిన్న సూచన అక్షరదోషం గురించి
    యండమూరికి కూడా ఈ సమస్యవుండేది. మొదట్లో దేవుడు బదులుగా దేముడు అని రాసేవారు.అలాగే మీరూ దేవుడి పనిపడుతున్నట్లున్నారు.

    ReplyDelete
    Replies
    1. సరిదిద్దుకోగలవాడను ధన్యవాదాలు సోదరా

      Delete
  2. చాలా ఆలశ్యమైపోయిందండీ ఈ కవిత చూడ్డం.. మీ వాస్తవికమైన ఆలోచనలకి నా జోహార్లు. నిజాన్ని నిర్భయంగా చాటే మీ ఈ కలం ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ..

    ReplyDelete
  3. ఒక చిన్న మనవి.. ఆ వర్డ్ వెరిఫికషన్ తీసేస్తే మంచిదేమో అని అనిపిస్తోంది :)

    ReplyDelete
  4. మీ బ్లాగ్ పేరు బాగుంది .తంగేడు పూలు పెట్టకుండా ప్రొద్దు తిరుగుడు పువ్వు పెట్టారు :)
    మీ రాతలు (కవితలు )బాగున్నాయి .

    ReplyDelete