నా అక్షరాలు రెక్కలు విప్పిన పక్షులు

Tuesday, August 28, 2012

నేను ఆకలినినేను ఆకలిని 

పరిచయం అవసరంలేని అద్రుశ్యాన్ని
ప్రాణం తీసే దాన్ని నేనే పోసే దాన్ని నేనే 
తారతమ్యాలు లేవు నాకు 
పేద వాడైనా పెద్దవాడైనా నాకు దాసుడే 

మూగబోయిన గొంతుని సవరించేది నేనే 
రగిలిన గుండెల ఆర్తనాదాలకి  నాదం నేనే 
డప్పు కొట్టినా ,చెప్పులు కుట్టినా ,డబ్బులు కూడబెట్టినా 
వడ్డిలపై వడ్డీలు వేసి సామాన్యుడు ని హింసించినా 
నా కోసమే వారందరి తపన 

ఊరిబయట నిద్రకళ్ళతో వొంటిని అమ్ముకున్నా
అదే వూరి బయట కాలుతున్న శవం పక్కన సరిచేస్తూ నిలుచున్నా 
వీధి వెంబడి మురుగును తోడేస్తూ మానవ 
ఆలోచనా మలినాలని వెలికితీసినా 
నన్ను జయించేందుకే

పరిశ్రమ పెట్టినా , పక్కోడిని చంపినా 
ముఖానికి రంగేసుకున్నా , వేలమందిని తీర్చిదిద్దినా 
పూలు మొక్కలు పెంచినా ,వ్యవసాయం చేసినా 
దేశం మీదకి దేశం దండెత్తినా గెలిచినా ,ఓడినా 
సమస్త నరజాతి నాకు చేసే ఊడిగమే అది 

విశ్వ జగత్తుని సమయాభావం లేకుండా శాసించగల 
చక్రవర్తిని ,ఓటమి ఎరుగని మహిమాన్వితుడిని 
అష్ట ఐశ్వర్యాలు ఉన్నా లేకున్నా 
నాకు కావాల్సింది నాకు ఇస్తే నేను ఓ శాంతమూర్తి ని 

ఆంక్షలు పెట్టినా ,అవరోధాలెన్ని కల్పించినా 
నేనో వాస్తవాన్ని మనిషి అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ 
వారిమధ్య తారతమ్యాలను నిరోధించడానికి 
కృషి చేస్తున్న మానవతావాదిని 
ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆలోచన క్రియని 
నేను ఆకలిని....................................

No comments:

Post a Comment